ramya
రచయిత
సిగాచీ పేలుడు ఘటనపై హైకోర్టు నోటీసులు జారీ
ramya
రచయిత
సిగాచీ పేలుడు ఘటనపై హైకోర్టు నోటీసులు జారీ

సంగారెడ్డి జిల్లాలోని సిగాచీ పరిశ్రమలో ఇటీవల జరిగిన పేలుడు ఘటనపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. ఈ ఘటనపై ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కే.బాబురావు అనే వ్యక్తి దాఖలు చేయగా, కేసును విచారించిన హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పిటిషన్ వివరాల ప్రకారం, సిగాచీ యాజమాన్యం అవసరమైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నదని పేర్కొన్నారు. పేలుడులో ఇప్పటివరకు 54 మంది ప్రాణాలు కోల్పోగా, 28 మందికి గాయాలయ్యాయని, 8 మంది ఆచూకీ ఇంకా లభించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వసుదా నాగరాజు తెలిపారు. బాధితులకు ఇప్పటివరకు ప్రకటించిన పరిహారం అందలేదని, పరిశ్రమ యాజమాన్యంపై కూడా సరైన చర్యలు తీసుకోలేదని వాదించారు. పేలుడు కారణాలపై ఏర్పాటైన కమిటీ నివేదికను ప్రజలకు అందుబాటులోకి తేవాలని, కేసును ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేయించాలని కోరారు. ఇటువంటి ఘటనలు తిరిగి జరగకుండా భద్రతా నియమాలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.