గృహ విద్యుత్ ఛార్జీలు పెరగవు – మంత్రి శివశంకర్ స్పష్టం | kranthinews |

గృహ విద్యుత్ ఛార్జీలు పెరగవు – మంత్రి శివశంకర్ స్పష్టం | kranthinews |

హైదరాబాద్:జూలై 1 నుంచి గృహ విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయనే వార్తలు పూర్తిగా నిరాధారమని రాష్ట్ర రవాణా, విద్యుత్ శాఖ మంత్రి పి. శివశంకర్ తెలిపారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన, గత మే 20న ప్రభుత్వం ఛార్జీల పెంపు ఉండదని ఇప్పటికే స్పష్టం చేసిందన్నారు.విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ సిఫారసుల ప్రకారం సీఎం ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నా కూడా, గృహ విద్యుత్ ఛార్జీలు పెరిగే అవకాశమే లేదన్నారు. ప్రస్తుతం అందుతున్న 100 యూనిట్ల ఉచిత విద్యుత్‌ మరియు ఇతర రాయితీలు యథాతథంగా కొనసాగుతాయని ఆయన హామీ ఇచ్చారు.

బ్రిటన్ వీసాలకు కొత్త షరతులు   భారతీయులకు ఎదురుదెబ్బ

బ్రిటన్ వీసాలకు కొత్త షరతులు భారతీయులకు ఎదురుదెబ్బ

బ్రిటన్‌లో ఉద్యోగాల కోసం వెళ్తున్న భారతీయులకు కఠిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. అక్కడి ప్రభుత్వం జూలై 22 నుంచి వీసా నిబంధనలను కఠినతరం చేయనున్నది. తక్కువ నైపుణ్యాలు కలిగిన ఉద్యోగాలకు వీసాలు పొందడం ఇక మరింత కష్టంగా మారనుంది. వలసలను తగ్గిస్తూ, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పులు వేలాది మంది భారతీయులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

లండన్ వీధుల్లో విరాట్ అనుష్క జంట రొమాంటిక్ వాక్

లండన్ వీధుల్లో విరాట్ అనుష్క జంట రొమాంటిక్ వాక్

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ లండన్ వీధుల్లో కలసి నడుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీరు తమ పిల్లలు వామిక, అకాయ్‌లతో కలిసి లండన్‌లో ఉంటున్నట్లు సమాచారం. కుటుంబానికి ప్రశాంతమైన వాతావరణం కోసం లండన్‌ను ఎంచుకున్న ఈ జంట, తాజాగా వీధుల్లో చేతులు పట్టుకుని నడుస్తూ, బేకరీ బయట కూర్చొని ఆత్మీయంగా ముచ్చటించడాన్ని కెమెరాలు బంధించాయి. ఇటీవలే టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన కోహ్లీ ప్రస్తుతం కుటుంబంతో సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు.

వాట్సాప్‌కి పోటీగా ఎలాన్ మస్క్ "XChat"

వాట్సాప్‌కి పోటీగా ఎలాన్ మస్క్ "XChat"

ఎలాన్ మస్క్ తాజాగా తన ఎక్స్‌ (X) యాప్‌లో "XChat" అనే మెసేజింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. ఇది వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, టెలిగ్రామ్‌లకు పోటీగా ముందుకొస్తోంది. ఎండ్-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌, డిసప్పియరింగ్‌ మెసేజెస్‌, ఆడియో-వీడియో కాల్స్‌ వంటి ఆధునిక ఫీచర్లతో వస్తున్న ఈ చాట్‌ ఫీచర్‌ వినియోగదారులకు సురక్షితమైన, నిరంతరాయమైన కమ్యూనికేషన్‌ను అందించనుంది. XChat బీటా టెస్టింగ్ దశలో ఉండగా, త్వరలో కొంతమంది యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఫోన్ నంబర్ అవసరం లేకుండా కాల్స్ చేయడం, ఫైల్ షేరింగ్ చేయడం వంటి ప్రత్యేకతలతో ఇది మల్టీపర్పస్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌గా ఎక్స్‌ను మారుస్తుందని భావిస్తున్నారు.

లండన్‌లో లలిత్‌ మోదీ, మాల్యా డ్యాన్స్‌ వీడియో వైరల్‌

లండన్‌లో లలిత్‌ మోదీ, మాల్యా డ్యాన్స్‌ వీడియో వైరల్‌

లండన్‌: పరారీలో ఉన్న లలిత్‌ మోదీ, విజయ్‌ మాల్యా లండన్‌లో ఓ గ్రాండ్‌ పార్టీలో పాల్గొని కలసి స్టేజీపై డ్యాన్స్‌ చేశారు. "ఐ డిడ్‌ ఇట్‌ మై వే" పాటపై స్టెప్పులేయడం సన్నివేశం వైరల్‌గా మారింది. ఈ పార్టీలో మాజీ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌తోపాటు దాదాపు 300 మంది పాల్గొన్నారు. ఈ వీడియోను లలిత్‌ మోదీ స్వయంగా షేర్‌ చేయగా, ‘‘ఇది వివాదాస్పదమే కానీ నేనయినే చేసాను’’ అంటూ వ్యాఖ్యానించారు. భారత్‌కు వీరిని తీసుకురావడానికి సీబీఐ, ఈడీ కొనసాగిస్తున్న ప్రయత్నాల మధ్య ఈ వీడియోపై నెటిజన్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది.

బ్లూటూత్ హెడ్‌ఫోన్లలో భద్రతా లోపం – CERT-In హెచ్చరిక

బ్లూటూత్ హెడ్‌ఫోన్లలో భద్రతా లోపం – CERT-In హెచ్చరిక

ప్రముఖ బ్రాండ్ల బ్లూటూత్ హెడ్‌ఫోన్లలో భద్రతా లోపాలు ఉన్నట్లు గుర్తించి, భారత సైబర్ భద్రతా సంస్థ CERT-In హెచ్చరిక జారీ చేసింది. తైవాన్‌కు చెందిన ఐరోహా చిప్‌ల వల్ల సుమారు 100 మోడళ్లలో ఈ లోపాలు ఉన్నట్లు వెల్లడించింది. ఈ హెడ్‌ఫోన్ల ద్వారా సైబర్ నేరగాళ్లు వినియోగదారుల ఫోన్‌లకు అనధికారంగా యాక్సెస్ తీసుకునే అవకాశముందని, వ్యక్తిగత డేటా చోరీ జరిగే ప్రమాదముందని నిపుణులు తెలిపారు. ముఖ్యంగా Sony, Jabra, JBL, Marshall, Bose మోడళ్లలో ఈ లోపాలు కనిపించాయని పేర్కొన్నారు. అందువల్ల Sony CH-720N, WF-1000XM3, WF-C500, Jabra Elite 8 Active, JBL Live Buds 3, Marshall MOTIF II, Bose QuietComfort Earbuds వంటి మోడళ్లను వాడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సంబంధిత కంపెనీలు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించేందుకు సిద్ధమవుతున్నాయి.

గూగుల్‌ కొత్త సంచలనం: నెట్ లేకుండానే ఏఐ ఫీచర్లు!

గూగుల్‌ కొత్త సంచలనం: నెట్ లేకుండానే ఏఐ ఫీచర్లు!

టెక్ దిగ్గజం గూగుల్‌ "AI Edge Gallery" పేరిట కొత్త యాప్‌ను విడుదల చేసింది. ఇంటర్నెట్‌ అవసరం లేకుండా ఫోన్‌లోనే ఏఐ మోడల్స్‌ ఉపయోగించుకునే వీలును ఈ యాప్ అందిస్తోంది. ఇమేజ్‌ల సృష్టింపు, కోడ్ రైటింగ్, సమాధానాల లభ్యత వంటి ఫీచర్లు దీనిలో లభ్యమవుతాయి. యూజర్ డేటా ఫోన్‌ లోనే ప్రాసెస్‌ కావడం వల్ల ప్రైవసీ రిస్క్‌ తగ్గుతుంది. గెమ్మా 31బీ మోడల్‌పై రన్ అయ్యే ఈ యాప్ కేవలం 529MB పరిమాణంలో ఉంది. ఇది శీఘ్రంగా టెక్స్ట్ ప్రాసెస్‌ చేయగలదు. ప్రస్తుతం ఇది ఓపెన్ సోర్స్‌లో అందుబాటులో ఉండగా, త్వరలో iOS వెర్షన్‌ కూడా రానుంది.

యూఏఈ గోల్డెన్ వీసా నిబంధనలలో కీలక మార్పులు – భారతీయులకు శుభవార్త!

యూఏఈ గోల్డెన్ వీసా నిబంధనలలో కీలక మార్పులు – భారతీయులకు శుభవార్త!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం భారతీయుల కోసం గోల్డెన్ వీసా నిబంధనలను సడలించింది. ఇప్పటి వరకు భారీ స్థిరాస్తులు లేదా వ్యాపార పెట్టుబడులుండాలి గోల్డెన్ వీసా కోసం, ఇప్పుడు రూ.23.30 లక్షలు (లక్ష ఏఈడీ) చెల్లిస్తే జీవితకాల వీసా పొందొచ్చు. ఈ మార్పులతో ప్రముఖులతో పాటు ఐటీ, ఆరోగ్యం, విద్య, కళల రంగాల్లో ఉన్నవారు, వ్యాపారులు కూడా ఈ వీసా ద్వారా లాభపడొచ్చు. ఇప్పటికే వేలాదిమంది భారతీయులు దుబాయ్‌లో స్థిరాస్తులు కొనుగోలు చేసి స్థిరపడేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ వీసా సౌలభ్యం వల్ల భారతదేశం నుంచి పెట్టుబడులు, నైపుణ్యాలు విదేశాలకు వలస వెళ్లే అవకాశం పెరుగుతుందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.

ఇన్‌స్టంట్ కాఫీ లవర్స్‌కు హెచ్చరిక దృష్టిలోపం ప్రమాదం 700% పెరుగుతుంది!

ఇన్‌స్టంట్ కాఫీ లవర్స్‌కు హెచ్చరిక దృష్టిలోపం ప్రమాదం 700% పెరుగుతుంది!

ఇన్‌స్టంట్ కాఫీ ఎక్కువగా తాగే వారిలో దృష్టి సమస్యలు వస్తున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. చైనాలోని హుబే యూనివర్సిటీ, షియాన్ తైహే హాస్పిటల్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం, ఇన్‌స్టంట్ కాఫీ కారణంగా వయోభారిత మ్యాక్యులర్ డిజెనరేషన్ (AMD) వచ్చే అవకాశం 700 శాతం పెరుగుతుంది. ఇది కంటి చూపును పూర్తిగా కోల్పోయే ప్రమాదానికి దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇన్‌స్టంట్ కాఫీల్లో ఉండే కొన్ని రసాయనాల వల్ల కంటి లోపల కీలకమైన భాగాలపై ప్రభావం పడుతుందని వివరించారు. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ జర్నల్‌లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. కాఫీ ఎక్కువగా తాగే వారికి—ప్రతిరోజూ 4–5 కప్పులు తీసుకునే అలవాటు ఉన్నవారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. ఆరోగ్యంగా ఉండాలంటే ఇన్‌స్టంట్ కాఫీ వినియోగాన్ని పరిమితం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

యెమెన్‌లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న నర్సు నిమిషా ప్రియా కేసులో సుప్రీం స్పందన

యెమెన్‌లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న నర్సు నిమిషా ప్రియా కేసులో సుప్రీం స్పందన

యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియ కేసుపై భారత సుప్రీం కోర్టు జూలై 14న విచారణ చేపట్టనున్నది. ఆమెను ఉరి నుంచి రక్షించేందుకు తక్షణం కేంద్ర ప్రభుత్వం జోక్యం కల్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలవగా, కోర్టు గురువారం స్పందించింది. 2008లో నర్సుగా యెమెన్‌ వెళ్లిన నిమిషా, అక్కడ మహ్దీ అనే వ్యక్తితో కలిసి ఓ క్లినిక్ నిర్వహించేది. వారిద్దరి మధ్య వ్యాపార సంబంధాలు కుళ్లిపోవడంతో, అనేక ఒత్తిళ్లలో ఆమె మహ్దీకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చిందని, అతడు మృతి చెందడంతో నిమిషాపై హత్యారోపణలు వచ్చాయి. 2018లో యెమెన్ కోర్టు ఆమెకు మరణశిక్ష విధించగా, దానిని అక్కడి అధ్యక్షుడు గతేడాది ఆమోదించాడు. జూలై 16న ఉరిశిక్ష అమలయ్యే అవకాశముండటంతో, ఆమె కుటుంబ సభ్యులు భారత్‌ ప్రభుత్వాన్ని, మానవ హక్కుల సంఘాలను సహాయానికి కోరుతున్నారు. యెమెన్ చట్టం ప్రకారం “బ్లడ్ మనీ” చెల్లిస్తే శిక్ష రద్దు చేయవచ్చు. అయితే బాధితుడి కుటుంబం ఇప్పటివరకు క్షమించేందుకు ముందుకురాలేదు. సుప్రీం విచారణతో నిమిషా ప్రాణాలకు ఊరట లభిస్తుందా అనే ప్రశ్నపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

అమెరికాలో ఉద్యోగాల కోత.. 1300 మందికి పైగా దౌత్యాధికారుల తొలగింపు

అమెరికాలో ఉద్యోగాల కోత.. 1300 మందికి పైగా దౌత్యాధికారుల తొలగింపు

అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం విదేశాంగ శాఖలో భారీ ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. ఇందులో 1107 మంది సివిల్ సర్వెంట్లు, 246 మంది దౌత్యవేత్తలు ఉన్నారు. వీరికి లేఆఫ్ నోటీసులు జారీ కాగా, కొందరికి 60 రోజుల గడువు మాత్రమే ఇవ్వబడింది. శాఖ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వ వర్గాలు సమర్థిస్తున్నప్పటికీ, ప్రస్తుత, మాజీ దౌత్యవేత్తలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అమెరికన్ ఫారిన్ సర్వీసెస్ అసోసియేషన్ ఇప్పటికే ఈ కోతలపై అభ్యంతరం తెలిపింది. ఫెడరల్ వ్యయాలను తగ్గించడంలో భాగంగా ఇప్పటికే ఇతర విభాగాల్లోనూ ఉద్యోగాల తొలగింపు జరిగింది.

మేజర్ లీగ్‌ క్రికెట్‌ ఫైనల్‌కి ఎంఐ న్యూయార్క్

మేజర్ లీగ్‌ క్రికెట్‌ ఫైనల్‌కి ఎంఐ న్యూయార్క్

మేజర్ లీగ్‌ క్రికెట్ టోర్నీలో న్యూయార్క్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఛాలెంజర్ మ్యాచ్‌లో టెక్సాస్‌ సూపర్ కింగ్స్‌పై 7 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టెక్సాస్‌ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. డుప్లెసిస్ (59), అకీల్ (55*) రాణించారు. తరువాత బ్యాటింగ్‌కు దిగిన న్యూయార్క్‌ 19 ఓవర్లలోనే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. నికోలస్‌ పూరన్ (52*), మోనాంక్ పటేల్ (49), పొలార్డ్ (47*) అద్భుతంగా ఆడి జట్టును గెలిపించారు. కీరన్ పొలార్డ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. టెక్సాస్‌ బౌలర్లలో అకీల్, జియా ఉల్ హక్, నూర్ అహ్మద్ ఒక్కొక్క వికెట్‌ తీశారు. ఫైనల్ మ్యాచ్ జూలై 13న వాషింగ్టన్ ఫ్రీడమ్ vs ఎంఐ న్యూయార్క్ మధ్య జరగనుంది.

78 లో 1-12 చూపిస్తోంది