భద్రాచలంలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత – కార్మిక సంఘాల సమ్మె

భద్రాచలంలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత – కార్మిక సంఘాల సమ్మె

నూతన కార్మిక చట్టాలకు, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా భద్రాచలంలో వామపక్షాల నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట బైఠాయించి బస్సులను నిలిపివేశారు. సీపీఎం, సీపీఐతో పాటు ఇతర కార్మిక సంఘాల సభ్యులు సమ్మెకు మద్దతుగా పాల్గొన్నారు. కార్మికుల హక్కులను కాలరాసే విధంగా పనిగంటల మార్పు నిర్ణయాన్ని విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు.

చర్లలో మావోయిస్టుల బ్యానర్లు, కరపత్రాలతో కలకలం

చర్లలో మావోయిస్టుల బ్యానర్లు, కరపత్రాలతో కలకలం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టులు సోమవారం కరపత్రాలు, బ్యానర్లు పెట్టి సంచలనం సృష్టించారు. ఆర్ కొత్తగూడెం ప్రధాన రహదారితో పాటు దానవాయిపేట ప్రాంతాల్లో ఇవి కనిపించాయి. ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల వారోత్సవాలను నిర్వహించాలని వాటిలో పేర్కొన్నారు. అలాగే ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా కూడా కరపత్రాల్లో వ్యాఖ్యలు చేయడం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు పరిస్థితిని సమీక్షించి, కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి: నీటిమట్టం 37 అడుగులు

భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి: నీటిమట్టం 37 అడుగులు

భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుండి వరదనీరు వస్తుండటంతో నదీ మట్టం 37 అడుగులకు చేరింది. స్నాన ఘట్టాలు, కళ్యాణ కట్ట వరకు వరద నీరు చేరింది. భక్తులు నదిలోకి దిగకుండా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పర్ణశాల వద్ద నారచీరల ప్రాంతం, సీతమ్మ విగ్రహం వరద నీటిలో మునిగాయి.