
మృతదేహం మారిన డ్రామా.. చనిపోయాడనుకున్న వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మృతదేహం మారిన ఘటనలో సంచలన మలుపు చోటుచేసుకుంది. చనిపోయాడనుకున్న గోక కుమారస్వామి బతికే ఉండటంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. మైలారం గ్రామానికి చెందిన కుమారస్వామి జీవనోపాధి కోసం ముంబయికి వెళ్లి అక్కడ రమ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. కుమారస్వామి మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పని చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం తొర్రూరులో ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో కనిపించగా, అతడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. దాన్ని కుమారస్వామిగా భావించి అతడి భార్య రమ మరియు కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకెళ్లారు. అయితే శవంపై "శ్రీ" అనే పచ్చబొట్టు లేకపోవడంతో సందేహం వచ్చి తిరిగి ఆసుపత్రికి తీసుకెళ్లగా అది వేరే వ్యక్తిదని తేలింది. చివరికి అసలైన కుమారస్వామి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిసి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు చేసిన తప్పుడు గుర్తింపు తీవ్ర విమర్శలకు దారితీసింది.

వరంగల్ ఎయిర్‌పోర్ట్ భూసేకరణకు రూ.205 కోట్లు విడుదల
వరంగల్ మామునూరులో కొత్త ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి భూసేకరణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రూ.205 కోట్ల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అవసరమైన 253 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. తాజాగా నిధుల విడుదలతో పనులు వేగంగా సాగనున్నాయి.