తిరుపతిలో రాళ్ల దాడి కలకలం… ఒకరి మృతి

తిరుపతిలో రాళ్ల దాడి కలకలం… ఒకరి మృతి

తిరుపతి : నగరంలోని కపిల తీర్థం కూడలిలో ఓ మతిస్థిమితం లేని వ్యక్తి వీరంగం సృష్టించాడు. ఫుట్‌పాత్‌పై ఉన్న యాచకులపై రాళ్లతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శేఖర్‌(55) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తిరుపతి జిల్లా పాకాలలో విషాదం: భార్య, పిల్లలను బావిలోకి నెట్టిన వ్యక్తి, ఆత్మహత్యాయత్నం

తిరుపతి జిల్లా పాకాలలో విషాదం: భార్య, పిల్లలను బావిలోకి నెట్టిన వ్యక్తి, ఆత్మహత్యాయత్నం

తిరుపతి జిల్లా పాకాల మండలం మద్దినాయినిపల్లెలో ఒక భయానక ఘటన చోటుచేసుకుంది. గిరి అనే వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా తన భార్య, ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసినట్లు సమాచారం. అనంతరం తానే గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని సీఐ సుదర్శన్ ప్రసాద్ తెలిపారు. గిరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

శ్రీవారి సేవలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

శ్రీవారి సేవలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు సోమవారం దర్శించుకున్నారు. వీఐపీ దర్శన విరామ సమయానికి ఆలయం వద్దకు వచ్చిన ఆయనకు తితిదే అదనపు ఈవో వెంకటేశం చౌదరి స్వాగతం తెలిపారు. తర్వాత ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితుల వేదాశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం తితిదే తరఫున తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, "భక్తులు సమర్పించే హుండీ ధనాన్ని ధార్మిక, ప్రజోపయోగ కార్యక్రమాలకే వినియోగించాలి" అని తెలిపారు. అలాగే, ప్రతి గ్రామంలో పాఠశాలలు మరియు దేవాలయాలు ఉండేలా చర్యలు తీసుకోవడం ప్రభుత్వంతో పాటు దేవస్థానాల బాధ్యత అని పేర్కొన్నారు.

తిరుపతిలో వైకాపా అనుచరుల వేధింపులు, గిరిజన యువకుడి పై దాడి

తిరుపతిలో వైకాపా అనుచరుల వేధింపులు, గిరిజన యువకుడి పై దాడి

తిరుపతి: తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అనుచరులు ఆగడాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల భూమన అనుచరుడు చైతన్య యాదవ్‌ ఓ వ్యాపారిపై దాడికి పాల్పడ్డాడు. తాజాగా, వైకాపా సోషల్ మీడియా ఇన్‌చార్జి అనిల్ రెడ్డి శ్రీనివాసం వసతిగృహం ఎదురుగా ఉన్న దుకాణాన్ని తనకు ఇవ్వాలంటూ పవన్‌ అనే గిరిజన యువకుడిని కిడ్నాప్ చేసి ఎంఆర్‌పల్లిలోని ఇంట్లో బంధించి హింసించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ దృశ్యాలు వీడియోలుగా బయటపడటంతో దుమారం రేగింది. ఈ ఘటనపై హోం మంత్రి అనిత తీవ్రంగా స్పందించారు. చట్టం ప్రతి ఒక్కరికి సమానమని, నేరపూరిత రాజకీయాలను సహించబోమని హెచ్చరించారు. దాడిలో పాల్గొన్నవారిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు.

తిరుమలలో దర్శనమైన నాగచైతన్య–శోభిత జంట

తిరుమలలో దర్శనమైన నాగచైతన్య–శోభిత జంట

టాలీవుడ్ నటుడు అక్కినేని నాగచైతన్య, నటి శోభిత ధూలిపాల గురువారం ఉదయం తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న ఈ జంటకు టిటిడి అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం బయటకు వచ్చిన ఈ జంట దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.